మేలుకున్న మానవత్వం - small moral story

 


అది 3500 సంవత్సరం

ఎటు చూసినా ప్రకృతి పచ్చదనంతో ఊగిపోతుంది.  పక్షుల కిలకిల రావాలతో సందడిగా ఉంది.  జింకలు, కుందేళ్ళు చెంగుచెంగున గంతులేస్తూ పరుగులు తీస్తున్నాయి. పక్కనే స్వచ్ఛమైన నీటితో పారే సెలయేరు ప్రవహిస్తోంది. అది పరుగులు తీస్తున్నప్పుడు వస్తున్న శబ్దానికే గొంతులోని పొడి ఆరినట్టుంది. దానిని తనివి తీరా ఆస్వాదిద్దామని సెలయేరులోకి దిగాను. కాళ్లంతా చల్లగా అవ్వింది. కాసిన్ని నీళ్లు దోసిల్లలోకి తీసుకుని తాగాను. ఆ నీరు ముందు దేవతల అమృతం కూడా వృధా అనిపించింది. ఎంత మధురంగా వున్నాయో మాటల్లో చెప్పలేను. ఎంతైనా తాగాలనిపించింది, ఆ నీరు తాగిన వారికి అసలు జీవితంలో దాహం అనేది తెలియదేమో అనిపించింది. తర్వాత సెలయేరు నుండి పైకి వచ్చి నా చెప్పులను తొడుక్కుని మళ్ళీ అమ్మ ఒడిలోకి ప్రయాణం మొదలు పెట్టాను. కొంత దూరం వెళ్ళాక ఎదురుగా నాకు ఒక పొడి ప్రదేశం కనిపించింది. అది కూడా పచ్చగా అయిపోతే బాగుండు అనిపించింది. వెంటనే పెద్ద పెద్ద గాలులతో వర్షం వచ్చింది. ఆ గాలులకు చెట్లు కొమ్మలు అటూ ఇటూ ఊగుతూ ఉన్నాయి. వాటి వాలకం చూస్తుంటే అలనాటి భారతీయ సంస్కృతిలో బంధువులను తినలేము అన్న బలవంతంగా  ఇంట్లోకి లాక్కుని వెెల్లిపోయె భారతీయులు కళ్ళముందు మెదిలారు. అలా ఆ చెట్లు  కూడా వర్షాన్ని ఆహ్వానిస్తూ ఉంది. ఆ ఊహల్లో నుండి తేరుకుని నేను వర్షం నుండి తప్పించుకోవడానికి ఓ పెద్ద చెట్టు కిందికి చేరాను. వాటి కొమ్మలు విశాలంగా ఉన్నాయి. వాటి కిందవున్న నా మీద ఒక్క చుక్క నీరు కూడా పడలేదు. నాకు ఆశ్రయం ఇచ్చిన అంతపెద్ద చెట్టును చూస్తే నాకు మన సంస్కృతే గుర్తుకొచ్చింది. ఇంతలో ఓ కమ్మటి వాసన నా నాసికాన్ని తాకింది. అన్నపూర్ణేశ్వరులు కూర వండితే ఎటువంటి వాసన వస్తుందో అలాగే కమ్మగా ఉంది. అది ఆ పొడి ప్రదేశం మీద వర్షం పడగా వస్తుంది. మా అమ్మకు నమస్కరించి ఓ రెండు పెద్ద ఆకులను తెంచి కిందన పార్చాను. కమ్మటి వాసనను ఆస్వాదిస్తూ అమ్మ ఒడిలో  నిద్దురపోయాను. కొంతసేపటికి ఒకతను వచ్చి నన్ను నిద్దురలేపాడు. సార్ మీ నేచర్ ఎక్స్పీరియన్స్ టైం అయిపోయింది బయటికి వెళ్ళండి అన్నాడు. నేను ఆ పెద్ద గదిలో నుండి బయటికి వచ్చేసా. గాలి ఆడడం లేదు. దాహంగా ఉంది. వాటర్ కొంటే అరచేయి అంత చిన్న బాటిల్ ఇచ్చాడు అతను.  దాన్ని తాగిన తాగినట్టే ఉంది. వెళ్లేదారిలో ఓ రెండు ఆక్సిజన్ సిలిండర్స్ కొనుక్కుని వెళ్ళాను. రాత్రి అయింది నిద్దుర పోయాను. రాత్రి ఆ కలలో ప్రకృతి అందులోని జీవాలన్నీ మళ్ళీ నాకు కనిపించింది. దీనంగా ముఖం పెట్టి నాతో ఒక్క మాట అన్నాయి.  ఆ మాట విని జాలి, అసహ్యం రెండూ కలిగాయి. కానీ ఏది  ఎవరిమీదో తెలుసుకదా! అవి అలా అన్న తర్వాత నాకు ప్రకృతిని కాపాడాలి అని అనిపించింది. అవి అన్న మాటలకి నాలో ఉన్న మానవత్వం లేని మనిషి చచ్చిపోయాడు. కానీ నాలో ఆ ఆలోచనని రప్పించిన కవి మాత్రం బ్రతికే ఉన్నాడు. ఇతరుల్లో కూడా ఆ ఆలోచనని రప్పించాలని. నిద్రలో నుండి లేచి అద్దంలో చూసుకున్న.... ప్రకృతిని కాపాడాలన్న ఆలోచన వచ్చిన మనసు, దానికి సహాయపడే కాళ్లు, చేతులు తప్ప మిగతావంత మృగంలానే కనిపిస్తున్నాయి.      *

**********************

ఇంతకీ అవి నాతో అన్న మాట ఏంటో తెలుసా? దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయవచ్చు కదా!


~ ఓ రచయిత

కామెంట్‌లు