మేలుకున్న మానవత్వం - small moral story

ఓ అందమైన అబద్దం - moral story in telugu

Image of cute boy


పీచు మిఠాయి, పీచు మిఠాయి అంటూ ఒక అతను బండిని తోసుకుంటూ వీధిలోకి వచ్చాడు. అతన్ని చూసి అంతసేపు అరుగు మీద కూర్చుని బియ్యంలో రాళ్లు ఏరుతున్న సరస్వతి, బియ్యం ఓ పక్కకు పెట్టి గబగబా ఇంట్లోకెళ్ళింది. డబ్బుల కోసం అని పప్పు డబ్బాల్ని, పోపుల డబ్బాల్ని తిరగేసింది. కానీ చిల్లిగవ్వ కూడా దొరకలేదు. సమయానికి భర్త కూడా ఇంట్లో లేడు అడుగుదామంటే. కంగారుగా వీధి వైపు చూడడం పప్పు డబ్బాలు తిరగేయడం చేస్తూవుంది. కానీ ఏ ప్రయోజనం లేకపోయింది. తనకేమో పీచు మిఠాయి అంటే చాలా ఇష్టం. చాలా రోజులకి వచ్చాడు అతను. మళ్లీ ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకే ఈసారి ఎలాగైనా తినాలని డబ్బుల కోసం వెతుకుతూ ఉంది. అలా కొంతసేపు గడిచింది ఆ పీచుమిఠాయి అతను బండిని తోసుకుంటూ వీధి చివరికి చేరిపోయాడు. దాంతో ఆమెలో కొంచెం నిరాశ, దుఃఖం కలిగింది. ఆమె గుమ్మం దగ్గర నిల్చుని అతన్నే చూస్తూ ఉంది. అలా అతను వీధిలో నుండి కనుమరుగై పోయేదాకా చూస్తువుంది. చివరికి అతను వీధిలో నుండి కనుమరుగై పోయాడు. ఇంకా చేసేదేం లేదనుకుని బాధతో అరుగు మీద కూర్చుని బియ్యం ఏరడం మొదలు పెట్టింది. కాని ఆమె మనసులో తను డబ్బులు ఎక్కడ పెట్టానబ్బా అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో తనకు ఏదో గుర్తుకువచ్చి ఆమె తన చీర కొంగు చివరన ఉన్న ముడిని విప్పింది. అందులో పది రూపాయల చిల్లరవుంది. చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఉంది నా యవ్వారం అనుకుని, ఆ చిల్లరను పట్టుకుని గబగబా వెళ్ళబోయింది. కానీ ఇంతలో మళ్ళీ తనకు ఏదో గుర్తుకువచ్చింది. అది తను బియ్యం కొనడం కోసం ఉంచిన డబ్బు. అది లేకపోతే వారికి ఒక పూట అన్నం ఉండదు అని తలచుకొని ఆగిపోయింది. తన కోరికను చంపుకుని, మళ్ళీ ఆ చిల్లరను కొంగులో ముడివేసింది. తర్వాత విచారంగా అరుగు మీద కూర్చుని బియ్యం ఏరడం మొదలు పెట్టింది. ఇంతలో ఓ రెండు చిట్టి చేతులు ఓ పెద్ద డిబ్బిని పగలగొట్టింది. డిబ్బి పెద్దదే అయినా దానిలో ఉన్న లెక్క మాత్రం చిన్నది. అందులో ఉన్న చిల్లరని ఆ రెండు చిట్టి చేతులు ఏరి చేతులు మారుస్తూవుంది. ఆ చిట్టి పెదాలు ఒకటి...రెండు.... మూడు... అని లెక్క పెడుతూ ఉంది. చివరికి 10 అని ఆపింది. తర్వాత ఆ పదిరూపాయలను పట్టుకుని వెనక తలుపుగుండా వీధిలోకి పరిగెత్తింది ఆ చిట్టి కాళ్ళు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది. ఆయాసంతో మోకాళ్లు పట్టుకుంది ఆ చేతులు. కానీ మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి ఆ కాళ్లు పరిగెత్తసాగాయి. పరిగెట్టి పరిగెట్టి చివరికి ఆ పీచు మిఠాయి అతన్ని చేరుకుంది. అతని దగ్గరికి వెళ్లి అన్నయ్య ఇదిగో పది రూపాయలు అని ఇచ్చింది. అది తీసుకుని ఓ పిడికెడు పీచుమిఠాయిని ఇచ్చాడు అతను. దాన్ని తీసుకుని తన జేబులో ఉన్న ఒక కవర్లో నింపుకుంది. తర్వాత ఆ పెదాలు,అన్నయ్య ఈరోజు నా పుట్టినరోజు. మీరు ఇంకా కొంచెం పీచుమిఠాయి ఇస్తే మా ఫ్రెండ్స్ కు పంచుతాను అని అంది. దానికి అతను చిన్నగా నవ్వుతూ ముద్దుగా ఉన్న ఆ బుగ్గల్ని గిల్లుతూ ఇంకో పిడికెడు పీచుమిఠాయిని ఇచ్చాడు. తర్వాత మళ్లీ ఆ పెదాలు అన్నయ్య నిజానికి మా అమ్మానాన్నల పుట్టినరోజు కూడా ఈరోజే, ప్లీజ్ ఇంకా కొంచెం ఇవ్వవా అని అడిగింది అమాయకంగా. అది అబద్ధమని తెలిసినా నవ్వుతూనే ఇంకో రెండు పిడికెళ్ళు ఇచ్చాడు అతను. అది తీసుకుని థాంక్స్ అన్నయ్య అని ఓ చిరునవ్వుతో పరిగెత్తింది ఆ కాళ్ళు. ఇంటికి చేరుకుని అమ్మాఅ అని పిలిచింది ఆ చిట్టి పెదాలు. ఆ పిలుపుకి ఇంటి లోపల నుండి బయటకు వచ్చింది సరస్వతి. వచ్చి రాగానే అరె చిన్ను ఎక్కడికి వెళ్లావు, ఇంతలా అలసిపోయావు అంది. అవును నిజానికి నీ పొట్టకు ఏమైంది అంత పెద్దదవ్వింది అని అడిగింది. అప్పుడు చిన్ను, అతని షర్టు లోపల కవర్ తో దాచిన పీచుమిఠాయిని తీసి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. అది నా పొట్ట కాదు అమ్మా పీచుమిఠాయి. వచ్చే దారిలో నా ఫ్రెండ్స్ కనిపిస్తే అడిగేస్తారని, ఇలా దాచాను అని చెప్పాడు. అవునా అని ఆమె దాన్ని తీసుకుని తినబోయి, అవును నువ్వు తిన్నావా అని అడిగింది. అప్పుడు చిన్ను తీసుకుని తిందాం అనుకున్నాడు, కానీ ఆ చిట్టి బుర్రకు ఏదో అనిపించింది. దాంతో వచ్చే దారిలోనే తినేసాను అమ్మా, అదంతా నీ కోసమే అన్నాడు. అవునా నా బుజ్జి బంగారం అంటూ చిన్నుని ముద్దుచేసింది సరస్వతి. తర్వాత పీచుమిఠాయి తీసుకుని తింటూ, చిన్ను చేయిని పట్టుకుని ఇంట్లోకి వెళుతూ ఉంది. అప్పుడు చిన్న వాళ్ళ అమ్మతో, అమ్మా నీకో విషయం తెలుసా? ఆ పీచు మిఠాయి అతను చాలా అమాయకుడు. నేను అబద్ధం చెప్పినా నమ్మేశాడు. మరీ అంత అమాయకుడులా ఉంటే ఎలా బ్రతుకుతాడో ఏంటో అన్నాడు.. నిజంగానా అంటూ వాళ్ళ అమ్మ ఓ నవ్వు విసిరింది.

తర్వాత రోజు

చనిపోయిన వాళ్ళ అమ్మానాన్నల ఫోటోలకు దండం పెట్టి, మళ్లీ పీచుమిఠాయి అంటూ వీధిలోకి వచ్చాడు ఆ పీచుమిఠాయి బండివాడు. ఈసారి మళ్లీ ఆ చిన్ని కళ్ళు, చిన్ని చేతులు, చిట్టి పెదాలు కలిగిన చిన్ను వస్తే అతనితో తనని చూసుకుందాం అని.

చిన్ను చెప్పిన చిన్న అబద్దాన్ని భర్తీ చేయడానికి వాళ్ళ అమ్మకు జీవితంలో ఎన్నో అబద్దాలు చెప్పవలసి వచ్చింది.


                                        - శుభం -


తన అమ్మ ఇష్టం కోసం తన చిన్న ఇష్టం వదిలేసిన, ఓ పొట్టి వాడి అమ్మ ప్రేమకు చిహ్నం ఈ కథ.

తను వినేది అబద్ధం అని తెలిసినా, దాని వలన తాను నష్టపోతానని తెలిసినా, తన వల్ల ఓ చిట్టి ప్రేమ సంతోషిస్తుందని ఆశించిన ఓ అనాధకు అంకితం ఈ కథ

ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ జీవితంలో కూడా ఇలాంటి తీపి జ్ఞాపకాలు ఉంటే మాతో పంచుకోవడానికి ప్రయత్నించండి.


మరిన్ని కథలు చదవండి :- kiddi story

కామెంట్‌లు