- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
అమ్మా అమ్మా త్వరగా రా అని పిలుస్తున్నాడు శివ. వాళ్లమ్మ వంట చేస్తూ అబ్బా ఏంట్రా నీ కంగారు, ఓ నిమిషం ఆగు అంటూ వచ్చింది. వచ్చి ఏంటి అంది. ఇది పట్టుకోయే అంటూ, తన భుజం మీద ఉన్న బుట్టలను దించి తనకు అందించాడు. తను ఏంట్రా ఇదంతా అంది. వేరుశెనక్కాయలు, కందిపప్పు, బీన్స్, తెల్లఉల్లి, వంకాయ, టమాట, బెండకాయ, నేలచిక్కుళ్ళు, కందిపప్పు, అల్లం, కరివేపాకు, బంగాళదుంప, ముల్లంగి, అరటికాయలు అని గబగబా చెప్పి ఉక్కరి బిక్కిరి అయిపోయాడు. అవన్నీ కనిపిస్తున్నాయి కానీ ఎందుకు ఇవన్నీ అంది ఆమె. అలిక తీర్చుకుని మెల్లిగా చెప్పడం మొదలెట్టాడు. ఏం లేదే మన కూరగాయల షాపు కంచి కాంతారావు ఉన్నాడు కదా అన్నాడు. ఆ ఉన్నాడు అయితే అంది తను. ఆయన కూతురు కామాక్షి పుట్టినరోజు అంట. తను పుట్టిన నుండి అతనికి వ్యాపారం బాగా కలిసొచ్చిందని ఆయన నమ్మకం. అందుకే తన పుట్టినరోజు సందర్భంగా కూరగాయలకు భారీ డిస్కౌంట్ ఇచ్చాడు. అందుకే మళ్ళీ ఇది దొరుకుతాయో లేదో అని ఒక్కో ఐటెంకి ఒక్కొక్క పార్సల్ కట్టించేసా అన్నాడు. అతను చెప్పింది అంతా విని నువ్వు ఉండాల్సిన వాడివే రా స్వామి అంది. నువ్వు అలా పొగడకే సిగ్గేస్తుంది అన్నాడు శివ. హుమ్...అనుకుని అవి పట్టుకుని తను వంట చేయడానికి వెళ్ళిపోయింది.
చాలాసేపు తర్వాత అమ్మ అని పిలిచాడు. మళ్లీ ఏంటి అంది తను. స్నానానికి వేడి నీళ్లు పెట్టు అన్నాడు. నువ్వే పెట్టుకోరా నేను ఖాళీగా లేను అంది ఆమె. నా చెయ్యి బాలేదు నువ్వే పెట్టు అన్నాడు. మరి కూరగాయలు ఎలా తెచ్చావు అంది. అది పట్టుకు రాలేదే మోసుకు వచ్చాను. అలాగే వేడి నీళ్ళు మోసాననుకో, తర్వాత నువ్వు నన్ను మూసుకుని వెళ్లాల్సి వస్తుంది అన్నాడు. అబ్బా వీడి గోల ఒకటి అనుకుని తనే వేడి నీళ్లు పెట్టింది. ఏది నీ చేయి చూపించు అంది అబద్ధమైతే మొట్టికాయ వేద్దామని. శివ చేయి చూపించాడు. అది చూసి వాళ్ళమ్మ అన్ని అబద్ధాలే అని అతన్ని కొట్టబోయింది, కానీ రెప్పపాటు కాలంలో తుర్రుమని పారిపోయాడు అతను. శివ స్నానం చేసి వచ్చాక అతనికి వాళ్ళమ్మ భోజనం వడ్డించింది. అమ్మా అన్నాడు. ఏంట్రా? అంది తను. మండుతుందే అన్నాడు. అందుకే చెప్పాను పచ్చడిని కొద్దిగా కలుపుకోమని అంది. అబ్బా మండుతుంది నోరు కాదే చెయ్యి అన్నాడు. మళ్లీ ఇంకో డ్రామా స్టార్ట్ చేశావా అంది. అబ్బా అని అరుస్తూనే ఉన్నాడు శివ. వీటికి ఇలా కాదు అనుకుని ఏదీ ఏమవ్వింది అని అడిగింది. శివ చేయిని చూపించాడు, చేతి మొత్తం కోసుకుని పోయి ఉంది. అరే ఇందాక బానే ఉంది కదా అంది ఆమె. ఇందాక నువ్వు చూసింది ఎడమ చెయ్యే అన్నాడు. అయ్యో బాగా తెగినట్టుంది, దారా మందు రాద్దాం అది తను. మందు వద్దే మండుతుంది అన్నాడు. ఏం మండదులే అంది తను. ప్లీజ్ మా కావాలంటే తిన్న తర్వాత రాద్దాం అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ అతని చేతిలో ఉన్న కంచం తీసుకుని, తనే ముద్దులుగా పెట్టే సాగింది అతనికి. వాళ్ళ అమ్మ పెట్టే ముద్దలను తింటూ...అమ్మా దేవుడు మనకు రెండు చేతుల్ని ఇచ్చి, ఒక్క నూరే ఎందుకు ఇచ్చాడు అని అడిగాడు.
నీలాంటి వాడు ఎక్కువ తినేస్తాడని అంది తను( నవ్వుతూ). ఓ అలాగా సరేలే ఎవరి ఫీలింగ్ వారిది అనుకున్నాడు. అవునమ్మా నీకు కూడా మీ అమ్మ చిన్నప్పుడు ఇలాగే పెట్టేదా అని అడిగాడు. దానికి ఆమె అవును పెట్టేది, అలాగే తినేటప్పుడు మాట్లాడితే ఇంకో చేత్తో రెండు మొట్టికాయలు కూడా పెట్టేది అంది. అప్పుడు శివ తన మనసులో ''బ్రతికిపోయా ఏనాడు మా అమ్మమ్మని ముద్దలుగా కలిపి పెట్టమని అడగలేదు అనుకున్నాడు. అవునే మరి నువ్వు ఎందుకు నన్ను ఏం చేయట్లేదు అని వాళ్ళమ్మని అడిగాడు. తను నవ్వుతూ ''నేను మా అమ్మను కాదు కదా మీ అమ్మను కదా అని అంది. నిజమే కదా అనుకున్నాడు శివ. మళ్లీ ఇంకో ప్రశ్న అడిగాడు. తను సమాధానం చెప్పింది. అతను అలా అడుగుతూనే ఉన్నాడు...తను నిదానంగా చెప్తూనే ఉంది. అలా చూడముచ్చటగా ముగిసింది ఆ క్షణం.
బయటకు వెళ్లి, అరుగు మీద పడుకోవడానికి తన మంచం సరి చేసుకుంటున్నాడు శివ. ఇంతలో వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. మంచం పక్కనే తనూ ఒక చాపను పరిచి, దాని మీద ఒక బొంతను కూడా పరిచి ఆమె కూడా పడుకోడానికి ఏర్పాట్లు చేసుకుంది. తర్వాత ఇంట్లోకి వెళ్లి పొయ్యిలో ఉన్న బొగ్గుల్ని ఒక పెద్ద పెళ్ళేరం లాంటి దాంట్లో తెచ్చి, శివకూ తనకు మధ్యలో ఉంచింది. చుట్టూ కూడా గోడ ఉండడం వల్ల, ఏ బెరుకు లేకుండా అలా పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఉన్నారిద్దరూ. ఇంతలో అతను మళ్ళీ ప్రశ్నలు పురాణం మొదలెట్టాడు. అమ్మ ఆ నక్షత్రాలను చూస్తూ ఉంటే నీకేమనిపిస్తుందే అన్నాడు. దాన్ని చూస్తే నక్షత్రాలే అనిపిస్తుందే అంది ఆమె. అది కాదే ఆ నక్షత్రాలన్నీ చనిపోయిన వారి గుర్తులనీ, చనిపోయిన సరే మన వాళ్లు మనల్ని అలా చూస్తూనే ఉంటారన్నావు గుర్తుందా? అని అడిగాడు. ఏమోరా నాకేమీ గుర్తులేదు అంది తను(గుర్తున్నా లేనట్టుగా). ఊరుకో అమ్మ నీకు గుర్తున్నా లేదే అంటావు అన్నాడు. వాటిని చూస్తూ ఉంటే నాకు తాతగారు గుర్తుకు వస్తున్నారు. ఒకసారి పండుగకు తాతయ్య వాళ్ళ ఊరు వెళ్లినప్పుడు అక్కడ నాటకం వేయడం. తాతగారు ఏమో శ్రీకృష్ణుని లాగా వేషం వెేయడం. ఆయన చెప్పే డైలాగ్ లు నా చేత కూడా బట్టి పట్టించడం. నాకేమో అవి పలకడానికి నోరు తిరక్క నత్తి పకోడీల అయిపోవడం. అన్ని గుర్తుకువస్తున్నాయి నీకేం గుర్తుకు రావడం లేదా అని అడిగాడు. నాకేం గుర్తు లేదే అంది తను(తెలిసినా తెలీనట్టుగా). హుమ్.. అనుకుని, అయినా అప్పుడు స్టేజి మీద తాతగారు చెప్పే డైలాగ్ లకి పడిపడి నవ్వే వాళ్ళం కదా అన్నాడు. అవునా ఏ డైలాగ్ లు చెప్పు అని అదిగింది ఆమె. వద్దులే నీకేమీ గుర్తుండదు కదా! చెప్పిన వేస్ట్ అన్నాడు శివ. చెప్పింది గుర్తుండదనా లేక నీకే డైలాగులు గుర్తులేదా? అంది తను నవ్వుతూ. ఎంత మాట ఎంతమాట నాకు గుర్తు లేక కాదే, నేను డైలాగ్ చెప్పాననుకో అయ్యో వీడి లాగా కూడా నేను చెప్పలేక పోతున్నానే అని నువ్వు ఫీల్ అవుతావె. నావల్ల ఒకరు బాధపడడం నాకు ఇష్టం లేదు అన్నాడు. చాల్లే ఇంక నీ ఓవరాక్షన్ ముందు డైలాగ్ చెప్పు అంది అమ్మ. అప్పుడు అతను మంచం నుండి కిందికి దిగి, మా ప్రతిభను అనుమానించు వారికి దానితోనె సమాధానం చెప్పేదము అన్నాడు. అబ్బో అంది తను. అప్పుడు శివ గొంతు సవరించుకుని ''అది శ్రీకృష్ణున్ని తమరాయబారీగా కౌరవుల దగ్గరకు పంపించే ముందు, కృష్ణునికి పాండవులకు మధ్య జరిగే సంభాషణ. అని సన్నివేశాన్ని వాళ్ళ అమ్మకు వివరించాడు. తను కూర్చుని మంట కాచుకుంటూ అతను చెప్పేది వింటూ ఉంది.
భీముడు ద్రౌపదికి జరిగిన అవమానాన్ని అందరికీ గుర్తు చేస్తూ రెచ్చిపోతుంటాడు. అప్పుడు శివ ధర్మరాజుల నటిస్తూ భీముని దగ్గరికి వెళ్లి: భీమసేనా కానున్నది కాక మానదు, శాంతింపుము అని అన్నాడు.
భీముడు: ఇప్పుడేమి చిరకాలం నుండి శాంతించుచునే యుంటిని అన్నాడు (వెటకారంగా). తర్వాత కృష్ణా అని కృష్ణున్ని పిలిచాడు భీముడు.
కృష్ణుడు:- ఆ! ఏమిటి బావ అని అడిగాడు.
భీముడు:- దుర్యోధనునొప్పించి సంధి కావింపుము.
కృష్ణుడు: ఏమి? ఏమి? సంధియా?. ఏమి ఈ విడ్డూరము భీమసేనుడనవలసిన మాటలేనా ఇవి అన్నాడు. (అప్పుడు ధర్మరాజు ఆశ్చర్యంగా కృష్ణుని వంక చూస్తాడు)
కృష్ణుడు భీమసేనుని ఉద్దేశించి:- నిద్రపోతుంటివో ......లేక బెదరి పలుకుచుంటివో...కాక తొల్లింటి భీమసేనుడవే కావో అన్నాడు.( అప్పుడు భీమసేనుడు ఆశ్చర్యంగా మరియు ఆవేశంగా కృష్ణుని వంక చూసాడు) కృష్ణుడు అవేవి పట్టించుకోక..
ఎనడీ చెవులు వినని కనులు చూడని శాంతంబు కాన వచ్చే అన్నాడు.( అప్పుడు భీమసేనుడు నిజమా అన్నట్టు చూసాడు. దానికి కృష్ణుడు అవునన్నట్లు తలూపాడు)
కృష్ణుడు:- కురుపతి పెందొడల్ విరుగగొట్టేదా రొమ్ము పగిలి గచ్చనెత్తురు కడుపార బ్రోలి అనితున్ మెద దుష్టుని దుష్టసేను భీకరగద చేత నందున్ ప్రగల్పలాడితివి అల్ల కొల్వులో.... మరల ఇదేల ఈ పిరికి మానిసి పలుకులు కుష్ఠ భోజన..... అన్నాడు.
(ఆ మాటలకు భీముడు నేను అన్న మాటలు అన్ని గుర్తుపెట్టుకుని, కరెక్ట్ టైం చూసి నాకు బాగా తినిపిస్తున్నావయ్యా అనుకుని ఏం చేయలేక లబోదిబోమన్నాడు)
నిద్రబోతుంటివో.... లేక బెదిరి పలుకుచుంటివో......కాక తొల్లింట భీమసేనుడవే కావో... అని ముగించాడు. శివ అలా త్రిపాత్రాభినయం చేసేసరికి వాళ్ళ అమ్మ అది చూసి నవ్వుతూ.. తన రెండు చేతులతో ఆపకుండా టపటపమని చప్పట్లు కొడుతుంది.అప్పుడు శివ కొద్దిగా ముందుకు వచ్చి చేతిని గుండ్రంగా తిప్పి టేక్ ఆ బౌ అన్నట్టుగా వంగి, ఇక చాలు అనుకుని వెళ్లి మంచం మీద వాలిపోయాడు. వాళ్ళ అమ్మ మాత్రం వాడు చేసిన దాన్ని గుర్తు తెచ్చుకుని మరీ నవ్వి, నవ్వి పడుకుంది.
Note :- ఆ పద్యాన్ని చాలా చోట్ల వెతికాము కాని దొరకలేదు. చివరికి యూట్యూబ్ లోనె చూసి మాకు అర్ధమయ్యినంత మేర ప్రయత్నించాము. తప్పుగా ఉంటే క్షమించగలరు.
ఇంకొక భాగాన్ని త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాము.
ఇట్లు మీ
రామ్...
Read first part here:- అమ్మ ఓ జ్ఞాపకం - volume 1
Part three :- volume 3
Part four :- volume 4
- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి